బతుకమ్మ పండుగ అనేది   పల్లె పడుచుల, స్త్రీమూర్తుల  వేడుక..
అనాదిగా వస్తున్న సంస్కృతీ సంప్రదాయాల వెనుక దాగి ఉన్న విజ్ఞాన విషయాలు
మనిషిని ఆరోగ్యంగా చేస్తాయని..
బతుకమ్మలో పేర్చే ప్రతి పువ్వు ఆయుర్వేదంలో ఔషధ విలువలున్నవే కావున
పువ్వులు నీట చేరి కాలుష్యాన్ని నివారిస్తాయని...
అంటువ్యాధులు ప్రభలకుండా ఈ ఆయుర్వేద సూత్రాలు కాపాడుతాయని విజ్ఞాన శాస్త్రం కూడా చెబుతోంది..
ఈ పండుగ పూట  ప్రజలందరూ సుఖసంతోషాలతో బతుకమ్మను జరుపుకోవలని కోరుకుంటూ..

బతుకమ్మ  పాటలు  ( రెండవ రోజు )

కోసలాధీశుండు ఉయ్యాలో – దశరథ నాముండు ఉయ్యాలో -
కొండ కోనలు దాటి ఉయ్యాలో – వేటకే బోయెను ఉయ్యాలో -
అడవిలో దిరిగెను ఉయ్యాలో – అటు ఇటు జూచెను ఉయ్యాలో -
చెట్టు గుబురుల చాటు ఉయ్యాలో – చెరువొకటి కనిపించె ఉయ్యాలో -
శబ్దమేదొ వినెను ఉయ్యాలో – శరమును సంధించె ఉయ్యాలో -
జంతువేదొ జచ్చె ఉయ్యాలో – అనుకొని సాగెను ఉయ్యాలో -
చెంతకు చేరగా ఉయ్యాలో – చిత్తమే కుంగెను ఉయ్యాలో -
కుండలో నీళ్ళను ఉయ్యాలో – కొనిపో వచ్చిన ఉయ్యాలో -
బాలుని గుండెలో ఉయ్యాలో – బాణమే గ్రుచ్చెను ఉయ్యాలో -
ఎవ్వరు నువ్వనె ఉయ్యాలో – ఏడ్పుతో దశరథుడు ఉయ్యాలో -
శ్రవణుడు నేననె ఉయ్యాలో – చచ్చేటి బాలుడు ఉయ్యాలో -
తప్పు జరిగెనంచు ఉయ్యాలో – తపియించెను రాజు ఉయ్యాలో -
చావు బతుకుల బాలుడుయ్యాలో – సాయమే కోరెను ఉయ్యాలో -
నా తల్లిదండ్రులు ఉయ్యాలో – దాహంతో ఉండిరి ఉయ్యాలో -
ఈ నీళ్ళు గొంపోయి ఉయ్యాలో – ఇచ్చి రమ్మనెను ఉయ్యాలో -
ఆ నీళ్ళతో రాజు ఉయ్యాలో – అడవంతా వెదికె ఉయ్యాలో -
ఒకచోట జూచెను ఉయ్యాలో – ఒణికేటి దంపతుల ఉయ్యాలో -
కళ్ళైన లేవాయె ఉయ్యాలో – కాళ్ళైన కదలవు ఉయ్యాలో -
వృద్ధ దంపతుల జేరి ఉయ్యాలో – వేదన చెందుతూ ఉయ్యాలో -
సాష్టాంగ పడె రాజు ఉయ్యాలో – సంగతి జెప్పెను ఉయ్యాలో -
పలుకు విన్నంతనే ఉయ్యాలో – పాపమా వృద్ధులు ఉయ్యాలో -
శాపాలు బెట్టిరి ఉయ్యాలో – చాలించిరి తనువులుయ్యాలో -
శాపమే ఫలియించి ఉయ్యాలో – జరిగె రామాయణం ఊయ్యాలో -
లోక కల్యాణమాయె ఉయ్యాలో – లోకమే మెచ్చెను ఉయ్యాలో


ఆడపిల్లను  పుట్టనిద్దాం... బతుకమ్మను ఆడనిద్దాం..

మీ
కడవెండి సీతారాంపురం అడ్మిన్


No comments:

Post a Comment

kadavendisitharampuram@gmail.com

Note: only a member of this blog may post a comment.